ఏపీలో మ‌రో ఒమిక్రాన్ కేసు నమోదు

Third Omicron omicron case identified in AP.క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Dec 2021 5:49 AM GMT
ఏపీలో మ‌రో ఒమిక్రాన్ కేసు నమోదు

క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మ‌హ‌మ్మారి త‌న పంజా విసురుతోంది. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఈ రోజు మ‌రో రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నాలుగుకు చేరుకుంది. తూర్పుగోదావ‌రి జిల్లాకు చెందిన 41ఏళ్ల మ‌హిళ‌తో పాటు విశాఖ‌కు 33ఏళ్ల వ్య‌క్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయిన‌ట్లు వైద్యఆరోగ్య శాఖాధికారులు వెల్ల‌డించారు.

తూర్పుగోదావ‌రి జిల్లా అయిన‌వెల్లి మండ‌లం నేదునూరి పెద‌పాలెంకు చెందిన 41 ఏళ్ల మ‌హిళ ఈ నెల 19న‌ కువైట్ నుంచి విజ‌యవాడ‌కు ఆ త‌రువాత స్వ‌గ్రామం నేదునూరు పెద‌పాలెంకు వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. ఆమె న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంప‌గా ఒమిక్రాన్ నిర్ఱాణ అయిన‌ట్లు తూర్పుగోదావ‌రి జిల్లా అద‌న‌పు డీఎంహెచ్‌వో వెల్ల‌డించారు. మ‌హిళ కుటుంబ స‌భ్యుల‌కు మ‌రోసారి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. నెగిటివ్ వ‌చ్చింద‌న్నారు. ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో కొనసీమ వాసుల్లో ఆందోళన మొదలైంది.

ఇంకొవైపు.. యూఏఈ నుంచి విశాఖ వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు. ఇద్దరిని క్వారెంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంలో ఈ రెండు కేసుల‌తో పాటు విజయనగరం జిల్లాలో ఒకటి, తిరుపతిలో మ‌రొక‌టి ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విదేశాల నుంచి రాష్ట్రానికి 53 మంది వ‌చ్చార‌ని.. అందులో 9 మంది క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింద‌న్నారు. వారి న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెనింగ్‌కు పంపిన‌ట్లు చెప్పారు.

ఒమిక్రాన్ భ‌య‌పెడుతుండ‌డంతో ఆరోగ్య‌శాఖ అప్ర‌మ‌త్తమైంది. ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం ఇతర క‌రోనా నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు నిర్వ‌హిస్తున్నామ‌ని.. నెగెటివ్‌ వచ్చినప్పటికీ వారం పాటు క్వారంటైన్‌లో ఉంచి.. ఆ తర్వాత వైద్య పరీక్షలు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

Next Story