దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక అంతర్భాగాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది . అలాగే ఏపీ, యానాం మీదుగా ట్రోపోస్పియర్ లో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. అంతేకాదు నిన్న రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తుండటంతో కొద్దిరోజులుగా ఎండలతో అల్లాడుతున్న ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. రాష్ట్రంలో ఆదివారం కురిసిన వర్షంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందారు. వర్షాల కారణంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్‌ఆర్, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.