విత్తన కొనుగోళ్లలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

ఎంపిక చేసుకునే విత్తనం మంచిదై ఉంటే పంట తప్పనిసరిగా మంచిగా పండి అధిక దిగుబడి, ఆదాయం లభిస్తుంది.

By అంజి  Published on  14 Jun 2024 4:30 AM GMT
farmers, seeds,  Agriculture

విత్తన కొనుగోళ్లలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే

విత్తనం గురించి తెలుగు సాహిత్యంలో మంచి సామెత ఉంది. 'విత్తు మంచిదైతే.. మొక్క మంచిదవుతుంది' అని. మనం ఎంపిక చేసుకునే విత్తనం మంచిదై ఉంటే పంట తప్పనిసరిగా మంచిగా పండి అధిక దిగుబడి, ఆదాయం లభిస్తుంది. విత్తనాల్ని ఎంపిక చేసే క్రమంలో ఆయ ప్రాంతాలకు అనువైన విత్తనాల సమాచారాన్ని వ్యవసాయ పరిశోధనా సంస్థల ద్వారా, వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలి.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

- మంచి నాణ్యత, మొలకెత్తే శక్తి అధికంగా కలిగిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి.

- విత్తనాలను లైసెన్స్‌ కలిగిన అధీకృత డీలర్ల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి

- సరైన సీలుతో , ధ్రువీకరణ పత్రంతో ఉన్న విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకొని కొనుగోలు చేయాలి.

- విత్తన రకం, లాట్‌ నంబర్‌, గడువు తేదీ తదితర వివరాలను సరిచూసుకొని విత్తనాలను కొనుగోలు చేయాలి.

- విత్తనాన్ని కొనుగోలు చేసిన తర్వాత అధీకృత డీలర్‌ నుంచి కొనుగోలు రశీదు తప్పకుండా తీసుకోవాలి. దీనిపై రైతు, డీలర్‌ సంతకం తప్పకుండా ఉండాలి.

- హైబ్రిడ్‌ విత్తనం కొనుగోలు చేసేముందు విత్తనం రకం, భౌతిక, జన్యు స్వచ్ఛతలు, మొలకెత్తే స్వభావం అన్నీ లేబుల్‌ మీద సరిగా ఉన్నాయా.. లేదా అని ఒకటికి రెండు సార్లు గమనించి కొనుగోలు చేయాలి.

- సిల్‌ తీసి ఉన్న విత్తన సంచులు, పగిలిన విత్తన ప్యాకెట్లు, మూతలు తీసిన డబ్బాల్లోని విత్తనాన్ని కొనుగోలు చేయరాదు.

- విత్తనం ఎక్కడ తయారైందో, ఏ కంపెనీ వారు పంపిణీ చేశారో, విత్తనాన్ని విక్రయించే దుకాణదారుడి నుంచి తెలుసుకోవాలి.

- విత్తనాన్ని కొనుగోలు చేసే సమయంలో విత్తన సంచి బరువు తక్కువగా అనిపిస్తే డీలర్‌ ముందు తూకం వేయించి తక్కువగా ఉన్నట్టు గుర్తిస్తే ఆ సంచిని డీలర్‌కి ఇచ్చి కొత్త విత్తనాన్ని తీసుకోవాలి.

- పంటకు విత్తనం వల్ల నష్టం జరిగితే రైతుకు విత్తన కొనుగోలు రశీదే కీలక ఆధారం. కావున రైతులు పంటకాలం పూర్తయ్యేవరకు కొనుగోలు చేసిన బిల్లుల రశీదులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. పూత, కాత రానిపక్షంలో నష్టపరిహారం కోసం రసీదు అవసరం ఉంటుంది.

Next Story