అధికారంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉందంటూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పట్ల వ్యతిరేకత ఉందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన సంస్కరణలపై ప్రజలకు అవగాహన లేకపోవడమే ఈ వ్యతిరేకతకు కారణమని ఆయన అన్నారు. రోడ్ల పరిస్థితిపై మంత్రి ధర్మాన స్పందించారు. రోడ్లకు కన్నాలేమైనా తామొచ్చి పెట్టామా? అని ప్రశ్నించారు.
దశలవారీగా రోడ్లను అభివృద్ధి చేస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో కన్నాలున్న రోడ్లను చూపించండి అంటూ మంత్రి సవాల్ విసిరారు. గత ప్రభుత్వంలో ఏర్పడిన కన్నాలే.. ఇప్పుడు పెద్దవై ఉంటాయన్నారు. టీడీపీ హయాంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. శ్రీకాకుళంలో మంగళవారం గడప గడపకూ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం రాష్ట్ర ప్రధాన రాజధానిగా పనిచేస్తుందని ఏపీ మంత్రి పేర్కొన్నారు. కర్నూలు, అమరావతి వరుసగా రాష్ట్ర న్యాయ, శాసన రాజధానులుగా పనిచేస్తాయని కూడా ఆయన చెప్పారు.