నదులు అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి నిమ్మల
నదులు అనుసంధానంతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
By Knakam Karthik
నదులు అనుసంధానంతోనే రాష్ట్రం సస్యశ్యామలం: మంత్రి నిమ్మల
నదులు అనుసంధానంతోనే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సచివాలయంలో గురువారం సర్ ఆర్థర్ కాటన్ వర్దంతి కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుడి చిత్రపటానికి మంత్రి నిమ్మల రామానాయుడు నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జలవనరుల సద్వినియోగంతోనే ఏ ప్రాంతాన్ని అయినా సస్యశ్యామలం చేయవచ్చని, కరవు కాటకాలను పారదోలవచ్చని సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు నిరూపించారని మంత్రి నిమ్మల ప్రశంసించారు. ఆయన స్ఫూర్తిని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో నదుల అనుసంధాన ప్రక్రియకు శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రాన్ని కరువు రహిత ప్రాంతంగా మార్చవచ్చని, ప్రతి ఎకరాకు నీరిచ్చి సిరిసంపదలు సృష్టించవచ్చని కార్యాచరణకు దిగినట్లు మంత్రి చెప్పారు.
ఆంగ్లేయుడైనప్పటికీ ఆర్ధర్ కాటన్ ఆనాడు ముందు చూపుతో ధవళేశ్వరం,కృష్ణా ఆనకట్టల తో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలకు,కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు. అయితే ఇన్నేళ్ల సుదీర్ఘ ఇరిగేషన్ చరిత్రలో గత ఐదేళ్ల జగన్ పాలన మాయని మచ్చలా తయారయింది అన్నారు. ఇరిగేషన్ రంగానికి జరిగిన నష్టం అపారమని ఆవేదన చెందారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇరిగేషన్ వనరులు విధ్వంసమయ్యాయి అన్న సంగతి తెలిస్తే కాటన్ దొర ఆత్మసైతం క్షోభిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆవిర్భవించిన ఈ సంవత్సరంలోనే పోలవరం ప్రాజెక్టుతో పాటు, ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. కాటన్ మహాశయుడి స్పూర్తితో గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోకుండా పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు చంద్రబాబు రూపకల్పన చేశారని మంత్రి చెప్పారు.