ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చికెన్ ధర భారీగా పెరిగింది. రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా కొన్ని చోట్ల కిలో రేటు రూ.300కు చేరింది. ఎండలు ముదిరితే ధర మరింత పెరిగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. గత రెండు నెలల్లో సగటున కిలో ధర రూ.180 నుంచి రూ.300కు చేరడంతో మాంసం ప్రియులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసం సమయంలో కేజీ చికెన్ రూ.130 నుంచి రూ.140 మధ్య ఉంది. దీంతో కోళ్ల ఫారాల యజమానులను నష్టాల భయం వెంటాడింది. ఈ కారణంగానే కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. దీంతో ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.
కొత్తగా కోళ్ల ఉత్పత్తి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలో కూడా చికెన్ ధరలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు కిలో చికెన్ రూ. 220గా ఉండేది. ఇప్పుడు క్రమంగా ధర పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల మేడారం జాతర కారణంగా కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలు ఆకాశనంటుతున్నాయి. కిలో లైవ్ కోడి ధర కూడా రూ. 180 వరకు చేరుకుంది. గత నాలుగు రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు 40 శాతం పడిపోయాయి.