జీవితంలో సవాళ్లను స్వీకరించాలని, అదే ప్రేరణతో రాష్ట్ర విద్యాశాఖను తీసుకున్నా..అని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. నెల్లూరులో వీఆర్ మోడల్ పాఠశాలను లోకేశ్ ప్రారంభించారు. తరగతి గదులను, డిజిటల్ విద్యావిధానాన్ని, లైబ్రరీలో పుస్తకాలను లోకేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తీసుకొని పాఠశాల ప్రారంభానికి నారాయణ తీవ్రంగా కృషి చేశారన్నారు. మంగళగిరి నియోజకవర్గం నిడమర్రు పాఠశాలను తాను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. పట్టుదల, క్రమశిక్షణతో ఏదైనా సాధించవచ్చన్నారు. సవాళ్లను స్వీకరించేందుకు అలవాటు పడాలని చెప్పారు.
గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోయా.. కసిగా పనిచేశా. ఐదేళ్లు కష్టపడ్డా.. దాని ఫలితమే ఎప్పుడూ రాని మెజారిటీతో గెలిచా. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పుడు.. కష్టమైన శాఖ ఎందుకు తీసుకున్నారని చాలా మంది నన్ను అడిగారు. పవిత్రమైన బాధ్యతతో స్వీకరించిన పనిని ఇష్టంగా చేస్తున్నా. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నా. యూనిఫామ్‌లు, మౌలిక సదుపాయాలతో పాటు అన్నింటిని మెరుగుపరిచాం. ప్రపంచంతో పోటీపడేలా విద్యార్థులకు మెరుగైన సాంకేతికత అందిస్తున్నాం’’ అని లోకేశ్ తెలిపారు.