ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం వరకు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ 9,236 మందికి పరీక్షలు నిర్వహించింది. కాగా ఆ పరీక్షల్లో ఇప్పటివరకు 1806 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. ఇదే కేసుల్లో మరణాల సంఖ్య 15కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.
కాగా ఈ మరణాలకు స్క్రబ్ టైఫస్‌తో పాటు దీర్ఘకాలిక, ఇతర అనారోగ్య సమస్యలు కారణమని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు చిత్తూరు జిల్లాలో 444 నమోదయ్యాయి. అటు కాకినాడ జిల్లాలో 183, విశాఖ 143, వైఎస్ఆర్ కడప 118, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు 113, విజయనగరం 96, తిరుపతి జిల్లాలో 90, గుంటూరు జిల్లాలో 85, అనంతపురం జిల్లాలో 83 కేసుల చొప్పున నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ స్క్రబ్ టైఫస్ అనుమానిత మరణాలను వైద్య ఆరోగ్యశాఖ తెలియజేసింది. ఇప్పటివరకు పల్నాడు జిల్లాలో 3, విజయనగరం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో 2 చొప్పున మరణాలు..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అన్నమయ్య, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల్లో ఒక్కో మరణం నమోదు అయిందని తెలిపింది.