Tirumala: బోనుకు చిక్కిన ఐదో చిరుత.. శేషాచలం కొండల్లో 45 చిరుతలు

తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బుధవారం అర్ధరాత్రి తరువాత మరో చిరుత చిక్కింది.

By అంజి  Published on  7 Sep 2023 4:22 AM GMT
Leopard Trap, Forest Department,Tirumala, TTD

Tirumala: బోనుకు చిక్కిన ఐదో చిరుత.. శేషాచలం కొండల్లో 45 చిరుతలు

తిరుమలలో చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా మరో చిరుత బోనులో చిక్కింది. ఆపరేషన్‌ చిరుతలో భాగంగా ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ట్రాప్‌లో ఐదో చిరుత బోనుకు చిక్కింది. ఈ ఆపరేషన్‌ గత నెల రోజులుగా సాగుతోంది. నరసింహస్వామి ఆలయం 7వ మైలు రాయి దగ్గర ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. దానిని ఎస్వీ జూకు తరలించారు. నాలుగు రోజుల కిందట చిరుతను ట్రాప్‌ కెమెరాల్లో ఫారెస్ట్‌ సిబ్బంది గుర్తించారు. నడక మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్‌ కెమెరాల్లో చిరుతల కదలికలు రికార్డ్‌ అయ్యాయి. ఆగస్టు 11వ తేదీన ఆరేళ్ల బాలికపై చిరుతపై దాడి చేయడంతో చిరుతలను బంధించేందుకు టీటీడీ, ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్ ఆపరేషన్‌ చిరుతను ప్రారంభించాయి. దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అటవీ శాఖ అధికారులు బంధించారు. జూన్‌ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో నాలుగు చిరుతలను అధికారులు పట్టుకోగా.. ఇప్పుడు మరో చిరుత బోనుకి చిక్కింది. శేషాచలం ఫారెస్ట్‌లో దాదాపు 45 చిరుతలు ఉన్నాయని ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ లెక్కలు చెబుతున్నాయి.

వీటిలో కొన్ని చిరుతలు మాత్రమే తిరుమల మెట్ల మార్గానికి సమీపంలోకి వస్తున్నాయి. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన తర్వాత అలిపిరి మెట్ల మార్గంలో 200 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. గతంలో తిరుమల నడక మార్గంలో చిరుతల సంచరాన్ని పలుమార్లు గుర్తించినా వాటిని పట్టుకునే ప్రయత్నాలు చేయలేదు. బాలుడిని నోట కరుచుకుని చిరుత వెళ్లడంతో దానిని పట్టుకునేందుకు బోనులు ఏర్పాటు చేశారు. జూన్ 24న బోనులో చిక్కిన చిరుతను నల్లమల ఫారెస్ట్‌లో విడిచిపెట్టారు. ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని బంధించడంతో భక్తులకు ఆపాయం తప్పినట్టేనని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా చిరుతలు ఉన్నాయో లేదో నిర్ధారించనున్నారు. ఆగస్టులో పట్టుకున్న మూడు చిరుతల్ని ప్రస్తుతం ఎస్వీ జూలో సంరక్షణలో ఉంచారు. చిన్నారి లక్షితపై దాడి చేసి చంపేసిన చిరుతల్లో ప్రస్తుతం చిక్కిన చిరుత ఉందో లేదో నిర్ధారించిన తర్వాత వాటిని ఎక్కడ విడిచి పెట్టాలనేది నిర్ణయించనున్నారు. భక్తుల భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది టీటీడీ.

భక్తుల భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదు: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి

తిరుమల ఘాట్ రోడ్డు నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో బుధవారం అర్ధరాత్రి తరువాత మరో చిరుత చిక్కిందని, భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. గురువారం ఉదయం చిరుత చిక్కిన బోను వద్దకు చేరుకున్న చైర్మెన్ భూమన మాట్లాడుతూ రెండు నెలల్లో చిక్కిన ఐదవ చిరుత ఇదన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో భక్తుల క్షేమం విషయంలో, వారి సౌలభ్యం కోసం టీటీడీ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో, వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతున్నదన్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి నేతృత్వంలో నిరంతర కృషి జరుగున్నదన్నారు.

ఇప్పటివరకు ఇద్దరు చిరుత పులి దాడికి గురైతే, అందులో ఒక పాప మరణించడం జరిగిందని, ఆ తర్వాత మరింత అప్రమత్తం అయ్యి భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయడం జరుగుతున్నదన్నారు. నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమనీ, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొంత కాలం వరకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్న పిల్లల నడిచేందుకు అనుమతి నిరాకరించడం జరిగిందన్నారు. భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి అదనపు భద్రత కల్పిస్తూనే, బుధవారం నుండి అదనంగా భక్తులలో ఆత్మ స్థైర్యం నింపడానికి కర్రలు ఇవ్వడం జరుగుతున్నదన్నారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు.

Next Story