అమరావతి: రాష్ట్రంలో అప్పులు పెరిగాయని జనరలైజ్డ్‌గా మాట్లాడటం సరికాదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గడిచిన పదేళ్లలో కేంద్రం సహా చాలా రాష్ట్రాల్లో అప్పులు పెరిగాయని అన్నారు. విజయవాడలో వే2న్యూస్ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. అప్పటి కరోనా సహా ఇతర పరిస్థితులతో సరైన ఉపాధి, ఆదాయ అవకాశాలు లేవని తెలిపారు. ఇక విభజన తర్వాత చాలా కీలకమైన మొదటి 5 సంవత్సరాలు ఏ పనినీ సరిగా చేయలేకపోయారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఆనాడు టీడీపీ ఆరోపించిందని బుగ్గన చెప్పారు. వాటిని మించి ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చాలని, లేకపోతే తప్పు చేసినట్టు ప్రభుత్వం ఒప్పుకోవాలని కోరారు.
వైసీపీ హయాంలో చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించిందన్నారు. తమ ప్రభుత్వంలో జీఎస్‌టీ వసూళ్లు పెరిగితే, కూటమి ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. రాబోయే పదేళ్లను దృష్టిలో పెట్టుకొని తమ హయాంలో ఎడ్యకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించామని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇప్పటి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికలు లేకుండా అప్పులు చేస్తోందని ఆరోపించారు. 2019 - 24 మధ్య వైసీపీ రూ.3 లక్షల కోట్లు అప్పు చేస్తే కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్షన్నర కోట్లు చేసిందన్నారు.