ఎత్తుకు పై ఎత్తు.. గుంటూరులో మారిన రాజకీయం.!

The developments of politics in Guntur district of AP are changing. గుంటూరు జిల్లాలో రాజకీయాల పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ ఎత్తులతో టీడీపీ చిత్తవుతోంది. ఎన్నికలకు

By సునీల్  Published on  1 Sep 2022 7:54 AM GMT
ఎత్తుకు పై ఎత్తు.. గుంటూరులో మారిన రాజకీయం.!

* లోకేష్‌కు షాకిస్తున్న టీడీపీ నేతలు

* తాడికొండలో వైసీపీకి తలనొప్పి

గుంటూరు జిల్లాలో రాజకీయాల పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ ఎత్తులతో టీడీపీ చిత్తవుతోంది. ఎన్నికలకు రెండేళ్ల సమయమున్నా అమరావతి రాజధాని పరిధిలో మాత్రం పాలిటిక్స్ హీటెక్కాయి. రాజధాన ప్రాంతంలో కీలక నియోజకవర్గాలు మంగళగిరి, తాడికొండ. 2019లో ఆ రెండు చోట్ల వైసీపీ జెండానే ఎగిరింది. మంగళగిరిలో ఈసారి ఎలాగైనా గెలవాలని మాజీ సీఎం తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు తాడికొండ పంచాయితీ వైసీపీకి తలనొప్పిగా మారింది. ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న ఈ మార్పులు గుంటూరు రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి.

రాజధాని ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం మంగళగిరి. అక్కడ గెలుపు టీడీపీకి అందని ద్రాక్షగా ఉంది. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రిగా పోటీ చేసిన లోకేష్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఎన్నికలు వచ్చాక అని కాకుండా 2019 ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచే ఇంటింటికీ తిరుగుతున్నారు.

నియోజకవర్గంలో బీసీ నేతగా, మాజీ మున్సిపల్ చైర్మన్‌గా మంచి పట్టున్న గంజి చిరంజీవి కాడి కింద పడేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న చిరంజీవి వైసీపీలో చేరడం.. లోకేష్‌కు షాకిచ్చినట్లే. ఏకంగా సీఎం జగన్ చేతుల మీదుగా కండువా కప్పించుకుని పార్టీ మారారు చిరంజీవి. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో పోటీకి చాన్స్ ఇస్తామనే హామీ గంజికి అధిష్టానం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ తాను అక్కడి నుంచే పోటీకి దిగనున్నట్లు ప్రకటించారు. రెండుసార్లు వరుసగా గెలిచిన ఆర్కేకు టికెట్ కాదని కొత్తగా చేరిన చిరంజీవికి సీటిస్తారా లేక గంజికి వేరే నియోజకవర్గాన్ని కేటాయిస్తారా అనే చర్చ జరుగుతోంది. అయితే జనరల్ సీటైన సత్తెనపల్లికి ఆర్కేను మార్చవచ్చనే ప్రచారం కూడా ఉంది.

రాజధాని ప్రాంతంలోని మరో కీలక నియోజకవర్గం తాడికొండ. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన తాడికొండ రాజకీయం చర్చనీయాంశంగా మారింది. తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా మాజీ మంత్రి, సీనియర్ నేత ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. శ్రీదేవిని రాబోయే ఎన్నికల్లో తప్పించేందుకే ఈ మార్పులంటూ జరుగుతున్న ప్రచారం స్థానికంగా మంట పుట్టిస్తోంది. డొక్కా రాకను వ్యతిరేకిస్తూ శ్రీదేవి వర్గీయులు నిరసనలు, ఆందోళనలకు దిగుతున్నారు. దీనిపై ఎవరి వర్గం వారు వారికి అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. సజ్జల వరకూ ఈ పంచాయితీ చేరడంతో ఆయన నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో అధిష్టానం మంగళగిరి, తాడికొండ నేతలతో భేటీ నిర్వహించి పంచాయితీలకు చెక్ పెడుతుందని సీనియర్లు చెబుతున్నారు.

Next Story