ఈ-క్రాప్‌ నమోదుకు.. ఈ నెల 30తో ముగియనున్న గడువు

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు సంబంధించి ఈ క్రాప్‌ నమోదు గడువు ఈ నెల 30తో ముగియనుంది.

By -  అంజి
Published on : 26 Sept 2025 9:35 AM IST

crop registration, Kharif season, crops, Andhra Pradesh

ఈ-క్రాప్‌ నమోదుకు.. ఈ నెల 30తో ముగియనున్న గడువు

ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు సంబంధించి ఈ క్రాప్‌ నమోదు గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా సాగుతోంది. ఇప్పటికీ ఈ క్రాప్‌ వివరాలు నమోదు చేసుకోని.. రైతులు వేగంగా వివరాలు నమోదు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీ రావు కోరారు. పంటల బీమాతో పాటుగా, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ, రైతులు పండించిన పంట కొనుగోలుకు ఈ క్రాప్‌ తప్పనిసరి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంట నష్టపోయిన రైతులకు 'పంట బీమా' పథకం అండగా నిలుస్తోంది.

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రాప్‌, ఈ కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలను వ్యవసాయ శాఖ సిబ్బందికి తెలియజేయాలి. అప్పుడు వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో పాటు ఈ కేవైసీ చేస్తారు. రైతు ఆధార్‌, మొబైల్‌ నంబర్‌, పొలం సర్వే నంబర్‌తో పాటు పొలం వద్ద ఫొటోలు తీసి ఈ - పంట యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. పంట నమోదు పూర్తైన తర్వాత ఈ కేవైసీకి వేలిముద్రలు తీసుకుంటారు. ఈ క్రాప్‌, ఈ కేవైసీ పూర్తైన వారికి మాత్రమే పంటల బీమా, ఇన్‌పుడ్‌ సబ్సిడీ వర్తిస్తుంది.

అలాగే ఈ క్రాప్‌లో నమోదైన రైతుల నుంచే ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తుంది. ఈ క్రాప్‌ డిజిటల్‌ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. సర్వేలో ఏవైనా తప్పులు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పంట విస్తీర్ణంతో పాటుగా, సాగు రకాల్లో తేడాలను నమోదు చేసేటప్పుడు తేడా రాకుండా చూసుకోవాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. అలాగే రైతులు కూడా తాము పండించే పంటలకు సంబంధించిన సరైన వివరాలను సిబ్బందికి అందించాలని కోరారు.

Next Story