'వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు'.. ఈసీఐ వివరణ
వైసీపీకి వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖలో కేంద్రం ఎన్నికల సంఘం పేర్కొంది.
By అంజి Published on 22 Jun 2023 10:31 AM IST'వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదు'.. ఈసీఐ వివరణ
ఏపీ: వైసీపీకి వైఎస్ జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాసిన లేఖలో కేంద్రం ఎన్నికల సంఘం పేర్కొంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని వివిధ మీడియా పత్రికల్లో కథనాలు వచ్చాయని, అయితే పార్టీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని, ఈ విషయమై పూర్తిగా స్పష్టత ఇవ్వాలని ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎంపీ రఘురామ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తాజాగా ఈ లేఖకు స్పందించిన ఎన్నికల సంఘం.. రఘురామకు లేఖ పంపింది. వైసీపీకి జగన్ శాశ్వత అధ్యక్షుడు కాదని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తమకు తెలియజేసినట్టు ఆ లేఖలో ఈసీఐ పేర్కొంది.
అంతేకాకుండా తమ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా కానీ, వైఎస్సార్‌సీపీగా కానీ మార్చే ప్రతిపాదన, ఆలోచన తమకు లేవని ఆ పార్టీ వివరించిందని కూడా ఈసీఐ ఆ లేఖలో స్పష్టం చేసింది. గత సంవత్సరం గుంటూరులో జరిగిన పార్టీ ప్లీనరీలో విస్తృత స్థాయి సమావేశాల సందర్భంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైసీపీ, వైఎస్సార్సీపీగా వ్యవహరించడంతో పాటు ఆ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి శాశ్వత అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయి రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఈసీఐ రూల్స్ ప్రకారం.. ఏ పార్టీకి శాశ్వత అధ్యక్షులు ఉండరు. ప్రతి రాజకీయ పార్టీ నిర్దిష్ట కాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించి.. ఆ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరపాలి. ఇవన్నీ కూడా భారత రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా శాశ్వత అధ్యక్షుడి ప్రతిపాదన ఏది పార్టీలో తీసుకోలేదని, ఆ ప్రకటనలతో పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదని తెలిపింది. పార్టీ నియమ నిబంధనల మేరకు ఎన్నికల ద్వారా మాత్రమే అధ్యక్ష ప్రక్రియ జరుగుతుందని వైసీపీ స్పష్టత ఇచ్చిందని ఈసీఐ పేర్కొంది.