పొత్తులా? ప్రచారమా?

The campaign that TDP is going to join NDA has become a hot topic of discussion in AP. ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతి అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలు

By సునీల్  Published on  2 Sep 2022 12:00 PM GMT
పొత్తులా? ప్రచారమా?

*ఎన్డీఏలో టీడీపీ చేరికపై ప్రచారం

*స్పందించే సమయం ఇది కాదన్న చంద్రబాబు

*జనసేనతోనే కలిసి నడుస్తామంటున్న బీజేపీ

ఎన్నికలకు ఇంకా రెండేళ్లున్నా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతి అంశంపై ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీ నిరసనలను అడ్డుకుంటూ కేసులు పెడుతోంది. మరోవైపు పార్టీలు మారుతున్న నేతలు కొత్త కండువాలు కప్పుకొంటున్నారు. ఏపీ రాజకీయ ముఖచిత్రం ఇలా ఉన్న సమయంలో ఎన్డీయేలోకి టీడీపీ చేరబోతోందనే ప్రచారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

టీడీపీకి అవసరమే..

2019 ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీయే పొత్తు నుంచి టీడీపీ బయటకొచ్చింది. కేంద్ర మంత్రి పదవులను వదులుకుంది. కేంద్రంలోని బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేరుగా బీజేపీ, మోదీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ జాతీయ స్థాయి ప్రచారం నిర్వహించారు. అయితే 2019లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఓటర్ల నాడిని పసిగట్టలేని టీడీపీ సజావుగా కొనసాగుతున్న ఎన్డీయేతో పొత్తును చెడగొట్టుకుందని పలువురు సీనియర్లు వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఓటమి నుంచి పొత్తుల విషయంలో సైలెంట్ అయిపోయిన చంద్రబాబు కొంత కాలంగా నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. కలవాలనే ఆలోచన ఒకవైపు కాదు రెండు వైపులా ఉండాలంటే వ్యాఖ్యానించారు. కానీ రాబోయే 2024 ఎన్నికల్లో గెలుపు టీడీపీకి అనివార్యం, అవసరంగా కనిపిస్తోంది.

ఎవరు గెలిచినా మార్పుండదు..

ఏపీలో వైసీపీ, టీడీపీల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా బీజేపీకి ఎలాంటి నష్టం లేదు. బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు కూడా లేదు. సింగిల్‌గా వెళ్లి ఒక సీటు తెచ్చుకోగలిగే స్థాయి అస్సలు లేదు. అయితే కేంద్రంలో మాత్రం బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకుని, ఎన్డీయే పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏపీలో ఏ పార్టీ గెలిచినా వారికి నష్టమేమీ లేదు. ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ మరోసారి అదే విషయం రుజువైంది. సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

వారే చెప్పాలన్న చంద్రబాబు

ఎన్డీయేలోకి టీడీపీ చేరబోతోందని ప్రచారం చేస్తున్న వారే సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతునారు. ప్రస్తుతం ఈ అంశంపై స్పందించబోనన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన దానికంటే.. జగన్ పాలన వల్ల రాష్ట్రం ఎక్కువ నష్టపోతోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే తాము కేంద్ర రాజకీయాలను చూస్తామన్నారు. అయితే సరైన ప్రతిపాదన వస్తే ఎన్డీయేతో జత కట్టాలనే ఆలోచనతో ఉన్నట్లుగా బాబు నర్మగర్భ వ్యాఖ్యల్లోని సారాంశంగా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేతలు కూడా చంద్రబాబు పొత్తులకు సానుకూలంగానే ఉన్నారని, అవసరమైతే ఒక మెట్టు దిగేందుకూ సిద్ధమని చెబుతున్నారు.

సమదూరంలో బీజేపీ..

ఏపీ రాజకీయాల్లో బీజేపీ రాష్ట్ర శాఖ అంతంతమాత్రమే. సీట్లు, పొత్తుల విషయంపై మాట్లాడాలంటే జాతీయ స్థాయిలోనే నిర్ణయం జరగాల్సి ఉంటుంది. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్నట్లు చెబుతున్నా.. కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఈ క్రమంలో ఇటీవల పలువురు బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఏపీలో సినిమా సీన్లను మించిన ఊహించని సీన్లు కనిపిస్తాయని సోము వీర్రాజు బహిరంగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఏపీ పర్యటనలో చిట్ చాట్ చేస్తూ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమంటూ మాట్లాడారు. తాజాగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నేత డా. లక్ష్మణ్ జనసేనతోనే తమ పొత్తని, టీడీపీ, వైసీపీ సమదూరమని వ్యాఖ్యానించారు. మొత్తంగా ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పొత్తుల చర్చలు హాట్ హాట్‌గా మారాయి.

Next Story