ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా
Tenth Exams Postponed in AP.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
By తోట వంశీ కుమార్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల కారణంగా పరీక్షలను వాయిదా వేసున్నట్లు హైకోర్టుకు తెలిపింది. ప్రభుత్వ టీచర్లకు వ్యాక్సిన్ వేసిన తరువాతనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని.. అప్పటి వరకు వాయిదా వేయాలన్న పిటిషన్ పై ఇవాళ హై కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. పదో తరగతి పరీక్షల నిర్వహణపై తిరిగి జులైలో సమీక్షించనున్నట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది.
విద్యాశాఖ అధికారులో సీఎం సమావేశం..
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ రోజు ఉదయం సీఎం జగన్ ఉన్నతాధికారులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే కర్ఫ్యూ అమలులో ఉండడంతో పాటు కేసుల సంఖ్య దృష్ట్యా కర్ప్యూని పొడిగించే అవకాశం ఉండడంతో పరీక్షల నిర్వహణపై చర్చించారు. కర్ప్యూ సమయంలో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో సీఎం పరీక్షలను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నారు.ఇదే విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తిరిగి జులైలో అప్పటి పరిస్థితులను బట్టి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది.