నేటి నుంచే పదో తరగతి పరీక్షలు
Tenth Class Public Examinations starts from Today.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి(బుధవారం) నుంచి పదో తరగతి
By తోట వంశీ కుమార్ Published on 27 April 2022 8:46 AM ISTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి(బుధవారం) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మే 9 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 6,22,537 విద్యార్థులు 3,776 పరీక్ష కేంద్రాలల్లో పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. ఇక విద్యార్థులను పరీక్షా కేంద్రంలోని 9.30గంటల వరకు అనుమతి ఇస్తామని ఆ తరువాత ఎవ్వరిని అనుమతించవద్దని అనుమతించవద్దని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజులు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నందున నేరుగా వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి చెప్పారు. హాల్‌టికెట్లపై ప్రధానోపాధ్యాయుడి సంతకం లేకపోయినా అనుమతించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
పరీక్షల్లో ఎలాంటి చూచిరాతలు, అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకోకుండా 156 ఫ్లైయింగ్, 292 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను అధికారులు రంగంలోకి దింపారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలను నిర్వహించలేదు. ఈ సంవత్సరం కూడా మహమ్మారి కారణంగా పాఠశాలలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఏడు పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
విద్యార్థులకు 24 పేజీల బుక్‌లెట్‌ను పంపిణీ చేయనున్నారు. వీటిలోనే సమాధానాలు రాయాలి. ఇందులో పార్టు–1లోని ఓఎమ్మార్ షీట్‌లో పేర్కొన్న వివరాలను హాల్‌టికెట్లలోని సమాచారంతో సరిచూసుకోవాలి. 24 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థులు రోల్ నంబర్లను, తమ పేర్లను, స్కూల్ పేర్లను రాయకూడదు. అలాగే గ్రాఫ్స్‌లో, మ్యాప్ పాయింట్లలో కూడా రోల్ నంబర్ వేయకూడదు. రోల్ నంబర్ వేసి ఉన్న ఆన్సర్ షీట్లను మూల్యాంకనం చేయరు. అలాంటివారిని మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డవారిగా పరిగణిస్తారు. కావున విద్యార్థులంతా ఈ విషయాన్ని గమనించాలి.