ప‌దోత‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ వ‌దంతులు.. స్పందించిన క‌లెక్ట‌ర్‌

Tenth Class Exam Paper leak rumor.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నేటి(బుధ‌వారం) నుంచి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 April 2022 1:03 PM IST
ప‌దోత‌ర‌గ‌తి ప్ర‌శ్న‌ప‌త్రం లీక్ వ‌దంతులు.. స్పందించిన క‌లెక్ట‌ర్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నేటి(బుధ‌వారం) నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. అయితే.. ప‌రీక్ష ప్రారంభ‌మైన కాసేప‌టికే ప్ర‌శ్నప‌త్రం లీకైన‌ట్లు వ‌దంతులొచ్చాయి. తెలుగు -1 పేపర్ ప్ర‌శ్నప‌త్రం ఓ వాట్సాప్ గూప్ర్‌లో క‌నిపించ‌డంతో విద్యార్థుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌నకు గుర‌య్యారు. చిత్తూరు జిల్లాలో ప్ర‌శ్న‌ప‌త్రం లీకైన‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా.. ఈ అంశంపై చిత్తూరు జిల్లా విద్యాశాఖాధికారి స్పందించారు. సోష‌ల్ మీడియాలో బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్ర‌శ్నాప‌త్నం జిల్లాకు సంబంధించింది కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప్ర‌శ్నప‌త్రం ఎక్క‌డ లీక్ జ‌రిగిందో త‌మ‌కు తెలియ‌ద‌న్నారు.

పలమనేరులో పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన జిల్లా కలెక్టర్ హరినారాయణ్ దృష్టికి పేప‌ర్ లీక్ విష‌యాన్ని తీసుకెళ్లారు. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తర్వాత సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందని డీఈవోకు సమాచారం అందిందని, వెంట‌నే డీఈవో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ప‌దో త‌ర‌గ‌తి ప్ర‌శ్నాప‌త్రం లీక్ వార్త‌లు న‌మ్మొద్ద‌ని అన్నారు. వ‌దంతులు, త‌ప్పుడు ప్ర‌చారాలు న‌మ్మొద్ద‌ని కోరారు. జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని క‌లెక్ట‌ర్ తెలిపారు.

Next Story