చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గడ్డూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాస్తారోకో, సభకు అనుమతి లేదంటూ టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసుల బారికేడ్లను తీసేసి నిరసనకు దిగారు. ఏపీ బార్డర్ లో అడిషన్ ఎస్పీతో పాటు నలుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. మరో వైపు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.
మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న చంద్రబాబు.. శాంతిపురం మండలం పెద్దూరు నుంచి రోడ్ షోలో పాల్గొనాల్సి ఉంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ప్రభుత్వం ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. ఈ విషయమై టీడీపీ కుప్పం కార్యాలయ ఇన్‌చార్జికి కూడా నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటి క్రితం పోలీసులు కుప్పం టీడీపీ కార్యాలయ ఇన్‌చార్జిని పిలిచి.. జీఓ ప్రకారం నడుచుకుంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తే ప్రచార రథాల వాహనాలను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఇప్పటికే పలమనేరు దగ్గర పోలీసులు ప్రచార వాహనాలను ఆపారు. మరి చంద్రబాబు ర్యాలీ నిర్వహిస్తారా లేక పోలీస్ రూల్స్ పాటిస్తారా అనేది చూడాలి.