ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యాలయంపైనా, ఆ పార్టీ నేతల ఇళ్లపైనా అధికార వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీకి చెందిన 'ఇదేమి కర్మ రాష్ట్రానికి' కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలతో వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం టీడీపీ కార్యకర్తలు, నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాచర్ల టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టారు. టీడీపీ నేతల వాహనాలకు నిప్పు పెట్టారు. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి వైసీపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు, టీడీపీ నేతల కార్లను ధ్వంసం చేసి తగులబెట్టారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు స్థానికంగా 144 సెక్షన్ విధించారు. టీడీపీ కార్యకర్తలను వైసీపీ కార్యకర్తలు వెంబడించారు. అయితే మాచర్ల పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆగ్రహించిన వైసీపీ నేతలు కూడా పోలీసు వాహనాలను వెంబడించారనే సమాచారంతో.. పోలీసులు బలవంతంగా టీడీపీ నేత బ్రహ్మారెడ్డిని మాచర్ల నుంచి గుంటూరు తరలించారు. మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులపై దాడి చేయడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు దాడి చేయడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు.
దాడికి పాల్పడిన అధికార పార్టీ కార్యకర్తలను విడిచిపెట్టి టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి మాచర్ల టీడీపీ పార్టీ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకున్నారని టీడీపీ నేత నారా లోకేష్ పోలీసులపై మండిపడ్డారు. టీడీపీ వర్గీయుల కార్లను తగులబెట్టి దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాడిలో గాయపడిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటానని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.