అమెరికాలో రోడ్డుప్రమాదం.. ఏపీ విద్యార్థిని మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని మృతి చెందారు.

By Knakam Karthik
Published on : 18 April 2025 10:28 AM IST

Andrapradesh, Guntur District, Telugu Student Died,  Accident In Texas Of America

అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఏపీ విద్యార్థిని మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని మృతి చెందారు. రాజేంద్రనగర్‌కు చెందిన దీప్తి (23) కొన్నాళ్ల క్రితం టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన తన స్నేహితురాలితో కలిసి రోడ్డుపై నడిచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తోన్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్రం గాయం కాగా మరో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. దాంతో వారిని చికిత్సకోసం హాస్పిటల్‌లో చేర్పించారు.

అనంతరం దీప్తి ఫ్రెండ్స్ ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ ఆఫీసును సంప్రదించగా..ఈ సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు. వెంటనే పెమ్మసాని తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్‌ తన స్నేహితుడు నవీన్‌ కు క్రౌడ్‌ ఫండింగ్‌ వచ్చేలా చూడాలని సూచించారు.

దాంతో ఆన్‌ లైన్‌ లో విరాళాల రూపంలో 80వేల‌ డాలర్ల వరకు రావ‌డంతో ఆ డ‌బ్బును చికిత్సకు వినియోగించారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చనిపోయింది. శనివారానికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్‌ తెలిపారు.

Next Story