డిజిటల్ పేమెంట్లకే సై
Telugu states top in Digital Transactions.మన దేశంలో 2013లో డిజిటల్ పేమెంట్ల శకం మొదలైంది.మొదట్లో కార్డు ద్వారా
By సునీల్ Published on 18 Aug 2022 11:56 AM IST- తగ్గుతున్న నగదు లావాదేవీలు
- 2014 నుంచి డేటా విడుదల చేసిన ఈ- తాల్
- నగదు రహిత చెల్లింపుల్లో తెలుగు రాష్ట్రాలే టాప్
ఈ- పేమెంట్, యూపీఐ, కార్డ్ స్వైపింగ్, నెట్ బ్యాంకింగ్.. కొన్ని సంవత్సరాలుగా చెల్లింపులు నగదు రహితంగా మారిపోతున్నాయి. మన దేశంలో 2013లో డిజిటల్ పేమెంట్ల శకం మొదలైంది. మొదట్లో కార్డు ద్వారా చెల్లించేందుకే ఆలోచించేవారు. ఇప్పుడు టీ తాగినా, పెట్రోల్ కొట్టించినా స్కానింగ్ చేసేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల ప్రపంచంలో నంబర్ వన్‌గా మన దేశమే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పోర్టల్ ఈ- తాల్ 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు దేశంలో జరిగిన ఈ- చెల్లింపులపై డేటా విడుదల చేసింది.
తెలంగాణ, ఆ తర్వాత ఏపీ..
నగదు రహిత లావాదేవీలన్నింటినీ లెక్కించి, నమోదు చేస్తుంది ఈ- తాల్ పోర్టల్. యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఇలా లావాదేవీ ఏదైనా, ఎంత మొత్తమైనా రికార్డ్ చేస్తుంది. 2014 జూన్ నుంచి 2022 జనవరి వరకు దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది జనాభాకు జరిగిన ఈ ట్రాన్సాక్షన్స్ డేటాను ఈ- తాల్ విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం టాప్‌లో తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 2014 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు తెలంగాణలో అత్యధికంగా ప్రతి వెయ్యి మంది లక్షా 38 వేల 266 ట్రాన్సాక్షన్లు చేసేశారు. ఏపీలో అదే సమయంలో లక్షా 37 వేల 264 మంది డిజిటల్‌లో నగదు బదిలీ చేశారు. ఆ తర్వాతి స్థానంలో మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళ ఉంది. కేరళలో లక్షా 31 వేల 16 ట్రాన్సాక్షన్లు నమోదయ్యాయి.
చివర్లో ఈశాన్య రాష్ట్రాలు
డిజిటల్ పేమెంట్లలో ఈశాన్య రాష్ట్రాలన్నీ చివరి స్థానాల్లో ఉన్నాయి. టాప్- 3 తర్వాత గుజరాత్ 72 వేల 935, హిమాచల్ ప్రదేశ్ 43, 133, తమిళనాడు 43 వేల 2, ఛత్తీస్ గఢ్ 40 వేల 422, పశ్చిమ బంగాల్ 37 వేల 182, హరియాణా 35, 816, మధ్య ప్రదేశ్ 26 వేల 20, రాజస్థాన్ 214, 157, పంజాబ్ 22, 839 ఇలా వరుసలో నిలిచాయి. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో రోజువారీ లావాదేవీలు ఎక్కువగానే ఉన్నా 2014 నుంచి ప్రతి వెయ్యి మందికీ చొప్పున జరిగిన లావాదేవీల డేటాలో మాత్రం వెనుకబడి ఉంది. యూపీలో 18 వేల 199 లావాదేవీలు నమోదయ్యాయి. ఇక ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ 5 వేల 703 ట్రాన్సాక్షన్లతో చివరి స్థానంలో ఉంది. అసోం 8, 209, జమ్ము కశ్మీర్ 7, 609, నాగాలాండ్ 7, 346, త్రిపుర 7 వేల 263 లావాదేవీలతో మణిపూర్ కన్నా పైన ఉన్నాయి.