తెలుగు దేశం పార్టీకి హ్యాకర్లు షాకిచ్చారు. ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్‌కు గురైనట్లు వెల్లడించారు. తిరిగి అకౌంట్‌ను పొందేందుకు ట్విట్టర్‌తో కలిసి పని చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం రాత్రి టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన మెసేజ్‌లు కాకుండా ఏవేవో విచిత్రమైన మెసేజ్‌లు కనిపించాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఐటీ విభాగం వెంటనే అప్రమత్తమైంది.కాగా.. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లే కాకుండా పార్టీల ఖాతాలు కూడా హ్యాక్ చేస్తున్నారు కేటు గాళ్లు.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ఓ వైపు పెగాసస్ వ్యవహరం పై రాజకీయ దుమారం చెలరేగింది. అధికార, విపక్ష మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం చర్చనీయాంశమైంది.