సీఎం జగన్‌తో సోమేశ్‌ కుమార్‌ భేటీ.. ఫైనల్‌ డెసిషన్‌ ఎక్కడా?

Telangana Ex CS Somesh Kumar meets AP CM YS Jagan. తెలంగాణ కేడర్‌ నుంచి రిలీవ్‌ అయి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని

By అంజి  Published on  12 Jan 2023 4:22 PM IST
సీఎం జగన్‌తో సోమేశ్‌ కుమార్‌ భేటీ.. ఫైనల్‌ డెసిషన్‌ ఎక్కడా?

తెలంగాణ కేడర్‌ నుంచి రిలీవ్‌ అయి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని డీఓపీటీ ఆదేశించడంతో.. తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉదయం విజయవాడకు చేరుకుని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిని కలిశారు. డీఓపీటీ ఆదేశాల మేరకు సోమేశ్‌కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. అనంతరం సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్‌ కుమార్‌.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. దాదాపు గంట పాటు వీరి భేటీ సాగింది. అయితే సీఎం జగన్‌ను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సోమేశ్‌ విముఖత వ్యక్తం చేశారు.

విజయవాడలో సోమేశ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ''కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఏపీకి వచ్చాను. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తాను. ఒక అధికారిగా నేను డిఒపిటి ఆదేశాలను పాటిస్తున్నాను. సీఎస్ జవహర్ రెడ్డికి రిపోర్ట్ చేస్తానని ఆయన చెప్పారు. వీఆర్‌ఎస్‌ ప్రతిపాదనలపై సోమేశ్‌కుమార్‌ స్పందిస్తూ.. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.'' ఒక వేళ సోమేశ్‌.. స్వచ్ఛందండా పదవీ విరమణ చేస్తే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా సోమేష్‌కుమార్‌ను నియమిస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పోస్టులు ఏవీ ఖాళీగా లేవు. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ కూడా వచ్చే ఏడాది జూన్‌ వరకూ ఈ పోస్టులో కొనసాగేందుకు అవకాశం ఉంది. సీఎంవోలో ఇతర ప్రధాన పోస్టులు కూడా భర్తీ కావడంతో.. సోమేశ్‌కు పోస్టు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదని సమాచారం. మరోవైపు సోమేశ్‌కుమార్ ప‌ద‌వీ కాలం ఈ ఏడాది డిసెంబ‌ర్ వ‌ర‌కే. దీంతో ఆయ‌న మిగిలిన ప‌ద‌వీకాలాన్ని పూర్తి చేస్తారా? లేక రాజీనామా చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.

Next Story