పాఠాలు చెప్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మాస్టారు
ఒక మాస్టారు పాఠాలు చెబుతూ ఉన్నట్లుండి కుర్చీలో కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 11 Sept 2023 3:02 PM ISTపాఠాలు చెప్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన మాస్టారు
గుండెపోటుతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొందరు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా హార్ట్ ఎటాక్ రావడంతో నిల్చున్న చోటే కూలబడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలా చూశాం. జిమ్ చేస్తుండగా.. రోడ్డుపై నడస్తుండగా గుండెపోటు వచ్చి కుప్పకూలి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే.. ఒక మాస్టారు పాఠాలు చెబుతూ ఉన్నట్లుండి కుర్చీలో కుప్పకూలి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది ఈ విషాదకర సంఘటన.
విజయనగరం జిల్లా చిడిపుట్టు ఎంపీపీ ఎస్ స్కూల్‌లో లలిత్ శంకర్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే.. ఆయన పిల్లలకు పాఠాలు చెప్తూ.. బోర్డుపై ఏవో అక్షరాలు రాసి వివరిస్తున్నారు. ఉన్నట్లుండి ఆయన ఒక్కసారిగా కుర్చీలో కుప్పకూలిపోయారు. క్లాస్‌లో ఉన్న విద్యార్థులకు ఏం అర్థంకాలేదు. బహుశా మాస్టారుకి ఆరోగ్యం బాగోలేదేమో... అందుకే విశ్రాంతి తీసుకుంటున్నారని భావించారు. కాసేపటికి మాస్టారు.. మాస్టారు అని పిల్లలు ఎంత పిలిచినా పలకలేదు. దాంతో.. భయపడిపోయిన విద్యార్థులు పక్క తరగతి గదిలో పాఠాలు చెబుతోన్న మరో మాస్టారుకి విషయం చెప్పారు. ఆయన వెంటనే లలిత్ శంకర్ మాస్టారు వద్దకు వెళ్లారు. ఆయనలో ఎలాంటి కదలిక లేకపోవడంతో.. గుండెపోటుకు గురయ్యారని భావించారు. సీపీఆర్ చేశారు కూడా. అయినా కూడా లలిత్ శంకర్ మాస్టారులో ఎలాంటి స్పందన లేదు.
వెంటనే ఇతర టీచర్లు అంబులెన్స్‌కు కాల్ చేసి.. లలిత్ శంకర్ మాస్టారుని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మాస్టారుని పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. లలిత్ శంకర్ వయసు 50 సంవత్సరాలు. ఆయన సతీమణి కూడా సీకరి పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. దీంతో పాఠశాలలో చదివే ప్రతి విద్యార్ధిని తమ పిల్లల్లా భావించారు లలిత్ శంకర్. వారికి విద్యాబుద్దులు నేర్పడం.. ఆర్ధిక పరిస్థితి బాలేని పిల్లల కుటుంబాలకు సహాయం చేసేవారు ఆ దంపతులు. దీంతో ఆ దంపతులంటే ఏజెన్సీ లో అందరికీ ఓ ప్రత్యేకమైన గౌరవం. ఇటీవలే ఆగస్ట్ 15 సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరూ మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. అందరికీ సాయం చేసే లలిత్ శంకర్ ఇక లేరనే వార్త ఆయన బంధువులు, స్థానికుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.