యాత్ర-2 సినిమా విడుదల అవుతోందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు స్పీకర్ ఏపీ అసెంబ్లీని వాయిదా వేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. శాసనసభ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పారని, కానీ 9.15 గంటల వరకు సభలో కోరం లేకపోవడంతో సభను వాయిదా వేశారని తెలిపారు. అంతేకాకుండా 11 గంటల వరకు సభను సమావేశపరచలేదని అన్నారు. అందుకే టీడీపీ శాసనసభా పక్షం ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిందని, సభ్యులందరం బయటికి వచ్చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. జగన్ రెడ్డి పాలనలో శాసనసభ నిర్వహించిన రోజులన్నీ బ్లాక్ డేస్ అనే చెప్పాలన్నారు అచ్చెన్నాయుడు. ప్రజాస్వామ్యంలో అధికారపక్షానికి, ప్రతి పక్షానికి సమాన అవకాశం ఇవ్వాల్సిన తరుణంలో ప్రతిపక్షసభ్యులు నోరెత్త కుండా వారి గొంతులు నొక్కేసింది ఈ సభలోనే అని అన్నారు. మహిళల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని కించపరిచేలా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ శాసనసభను కౌరవసభగా మార్చిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక ఈరోజు అసెంబ్లీ సమావేశాలు 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 9.10 గంటలైనా అసెంబ్లీ హాలు ఖాళీగా ఉందని అచ్చెన్నాయుడు ఓ వీడియోలో మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోను టీడీపీ నేతలు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 9 గంటలకే అసెంబ్లీ జరపాలని నోటీసు ఇవ్వడంతో తాము 8.55 గంటలకే అసెంబ్లీకి వచ్చామని, కానీ 9.10 అయినా ముగ్గురు వైసీపీ శాసనసభ్యులు మాత్రమే సభలో ఉన్నారని అన్నారు. జగన్‌పై ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఉండే నమ్మకం ఇదేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 9.10 గంటలైనా బెల్ కొట్టలేదని విమర్శించారు.