ఆ వీడియోపై మాట్లాడాలంటే మాకు సిగ్గుగా ఉంది.. కానీ: టీడీపీ ఎంపీ

TDP MP Rammohannaidu Latest comments on Gorantla Madhav issue. వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారడంతో, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ

By అంజి  Published on  9 Aug 2022 8:16 AM GMT
ఆ వీడియోపై మాట్లాడాలంటే మాకు సిగ్గుగా ఉంది.. కానీ: టీడీపీ ఎంపీ

వైసీపీకి చెందిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఫిర్యాదు చేయడంతో రాజకీయంగా పెద్ద దుమారమే రేపింది. టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్‌మోహన్‌ నాయుడు, కనకమేడల రవీందకుమార్‌లు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ కేవలం తమ పార్టీ ఎంపీల అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని, పార్టీ ఫిరాయింపు రాజకీయాల్లో వైసీపీ మాస్టర్‌గా మారిందని అన్నారు.

గోరంట్ల మాధవ్‌ను కాపాడేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. మాధవ్‌ వ్యవహారంలో వైసీపీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, భయపడుతున్నారా? అని నిలదీశారు. వెంటనే మాధవన్‌ను డిస్మిస్‌ చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారని, ఇప్పుడేమో అది ప్రైవేట్‌ వ్యవహారమని మాట్లాడుతున్నారని అన్నారు. మాధవ్‌పై చర్యలు తీసుకుంటే.. అదే పార్టీలో ఉన్న సగానికి సగం మంది పైనా చర్యలు తీసుకోవాలని భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల్లో చాలా మందిపై అత్యాచార కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లలో చూశామన్నారు.

సీఎం జగన్‌కు రాజకీయాలు ముఖ్యం తప్ప.. ప్రజలు, మహిళల ప్రయోజనాలు కాదన్న విషయం అర్థమవుతోందన్నారు. ఎంపీ మాధవ్‌ వీడియోపై మాట్లాడాలంటే తమకు సిగ్గుగా ఉందని రామ్మెహన్‌ అన్నాడు. ఈ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. మహిళల రక్షణ, పార్లమెంట్‌ గౌరవం కాపాడాల్సిన బాధత్య సాటి ఎంపీలుగా తమపై ఉందన్నారు. ఇలాంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు ప్రజలకు పార్లమెంట్‌పై ఉన్న గౌరవం, నమ్మకం దిగజారిపోతుందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.

Next Story