Andhraprades: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత
తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) గురువారం గుండెపోటుతో మృతి చెందారు.
By అంజి Published on 2 March 2023 3:30 PM GMTఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత (ఫైల్ ఫొటో)
ఆంధ్రప్రదేశ్: తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (65) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా ఉన్న బచ్చు అర్జునుడు.. ఈ ఏడాది జనవరి 28వ తేదీ గుండెపోటుతో కుప్పకూలారు. అయితే వెంటనే బచ్చును చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత వైద్యులు బచ్చులకు స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఐసీయూలోనే బచ్చుల చికిత్స పొందుతున్నారు. రక్తపోటు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు.
త్వరలోనే బచ్చుల కోలుకుంటారని అందరూ భావించారు. బచ్చులను బతికించడానికి వైద్యులు శథవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. నెల రోజులుగా మృత్యువుతో పోరాడిన బచ్చుల.. గురువారం సాయంత్రం మరణించారు. ఆయన మృతదేహాన్ని ఆ ప్రైవేట్ దవాఖాన నుంచి మచిలీ పట్నంలో ఆయన సొంతింటికి తరలించారు. బచ్చుల అర్జునుడు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం వాసి. టీడీపీలో చేరి రాజకీయాల్లోకి వచ్చారు. 1995-2000 మధ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్షుడిగా పనిచేశారు.
ఆ తర్వాత 2000-05 మధ్య మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా సేవలందించారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ ఉన్నారు. 2017లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి బచ్చుల అర్జునుడు ఎన్నికయ్యారు. ఈ నెల 29తో బచ్చుల అర్జునుడు పదవీ కాలం ముగియనున్నది. ఇంతలోనే బచ్చుల కన్నుమూశారు. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు, శ్రేణులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నాయి.
తెలుగుదేశం సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గారి మరణం అత్యంత విషాదకరం. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకుంటారని అనుకున్నాము. అర్జునుడు గారి మృతి పార్టీకి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/Tm6hzrlnRx
— N Chandrababu Naidu (@ncbn) March 2, 2023