టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్
TDP MLC Ashoke Babu Arrested.టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వాణిజ్య
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2022 8:54 AM ISTటీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో పని చేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారనే ఆరోపణల నేపథ్యంలో గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తన నివాసానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మాటు వేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు, కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం ఇస్తూ నోటీసు అందించారు.
అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో ఏసీటీవోగా పని చేసి రిటైర్ అయ్యారు. కాగా.. అశోక్ బాబు డిగ్రీ విషయంలో విజయవాడకు చెందిన మెహర్ కుమార్ గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త వాణిజ్య పన్నుల విభాగం నుంచి నివేదిక తెచ్చుకుంది. దీనిపై విచారణ జరిపించాలని కోరింది. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి.గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వివిధ సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. నేడు(శుక్రవారం) కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఈ ఘటనపై టీడీపీ స్పందించింది.రాజకీయ కక్షసాధింపులో భాగంగానే అశోక్‌బాబును సీఐడీ అరెస్ట్ చేసిందని విమర్శించింది.