నేను.. పవన్‌ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులం: ఎమ్మెల్యే బాలకృష్ణ

గురువారం హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు.

By Srikanth Gundamalla  Published on  16 Nov 2023 5:45 PM IST
tdp, mla balakrishna, pawan kalyan, janasena,

నేను.. పవన్‌ ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తులం: ఎమ్మెల్యే బాలకృష్ణ

గురువారం హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని రోగులు బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలకృష్ణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, వైద్య పరికరాలు లేవని, ఉన్న వాటిని వాడుకోలేదని విమర్శించారు. గతంలో తాను ఇచ్చిన వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నాయని, టీడీపీ హయాంలో ఆస్పత్రి శుభ్రంగా ఉండేదని, ఇప్పుడు అలా లేదని బాలకృష్ణ అన్నారు.

ఆస్పత్రిలో కనీసం సీలింగ్ కూడా సరిగా లేదని, ఇవాళ ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అంటున్నాయన్నారు బాలకృష్ణ. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇచ్చిన నిధులను కూడా వేరే స్కీమ్‌లకు డైవర్ట్ చేశారన్నారు. 460 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం వేరే స్కీమ్‌లకు తరలించిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కూడా కట్టిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు శాశ్వత పరిష్కారం ఇంకో 4 నెలల్లో వస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

జనసేనతో పొత్తుపై మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. రాష్ట్రం మొత్తం అన్ని సీట్లు కాదు టీడీపీ, జనసేన గెలవాలన్నారు. తాను, పవన్ కళ్యాణ్ ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తులం అని చెప్పారు. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ది శూన్యం అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో పాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతుల్లో ఉందన్నారు. ఈ క్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ. ప్రతిపక్షంలో ఉండి తాము అభివృద్ధి చేస్తున్నామని.. కానీ వైసీపీ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Next Story