ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత.. మీసం మెలేసిన బాలకృష్ణ.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం ముట్టడించారు.
By అంజి Published on 21 Sept 2023 11:00 AM ISTఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత.. మీసం మెలేసిన బాలకృష్ణ.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, ఆ అంశంపై చర్చించాలని టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. దీనిపై చర్చకు స్పీకర్ నిరాకరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుండగా టీడీపీ వాయిదా తీర్మానానికి పట్టుబడుతూ స్పీకర్ పోడియంను ముట్టడించారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించడం, కాగితాలు చించి విసిరే ప్రయత్నం చేశారు. ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులపైకి వైసీపీ సభ్యులు దూసుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.
ఓ వైపు టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతుండగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని మంత్రి మేరుగ నాగార్జున ప్రారంభించారు. సేవ డెమోక్రాసీ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బుగ్గన ప్రకటించారు. అర్థంలేని వాయిదా తీర్మానాలతో సభను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. చట్టప్రకారం న్యాయవిచారణ జరుగుతున్నా తాము సభలో చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. బీఏసీ మీటింగ్‌లో సభ నిర్వహణపై చర్చించిన తర్వాత తాము ఎలాంటి చర్చకైనా సిద్ధం అని బుగ్గన చెప్పారు. సరైన పద్ధతిలో చర్చకు రావాలని టీడీపీ సభ్యులకు సూచించారు.
మరోవైపు టీడీపీ సభ్యులు స్పీకర్ మీద దాడికి రెడీ అవుతున్నారని, సభలో అవాంఛనీయ ఘటనలు జరిగేలా రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి ఆరోపించారు. టీడీపీ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేయడంతో అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసుకుందాం రావాలంటూ సవాలు విసిరారు. స్పీకర్ పోడియం వద్ద నిలబడి బాలకృష్ణ మీసం మెలేయడంతో.. వైసీపీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి బాలకృష్ణపైకి దూసుకెళ్లి తొడగొట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా టీడీపీ సభ్యులతో జత కలిశారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ పోడియంను ముట్టడించారు.