పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారే కరువయ్యారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను.. సీఎం జగన్ ప్రభుత్వం లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులుగా ఇచ్చిందని దేవినేని విమర్శించారు. ప్రధాని మోదీకి సీఎం జగన్ ఇచ్చిన వినతిపత్రాన్ని.. మీడియాకు ఇవ్వలేని దుస్థితి, నిస్సహాయ స్థితిలో సీఎం జగన్ ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. 22 మంది ఎంపీలు, తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు ఉండి కూడా విభజన హామీలు సాధించలేకున్నారని ఉమా మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలంటే పర్మిషన్ కావలనడం సిగ్గుచేటన్నారు. పోలవరం నిర్వాసితులను ఆదుకునేవారు కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసితులకు కనీసం భోజనం పెట్టేవారు, బియ్యం ఇచ్చే వారు లేరన్నారు. సీఎంకి తాడేపల్లిలో నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ హయాంలో లక్షలాది మంది పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో చేసిన డయాఫ్రమ్ వాల్ పనులకు కేంద్రం ఇచ్చిన డబ్బులను.. ప్రభుత్వం లిక్కర్ కంపెనీలకు అడ్వాన్సులుగా ఇచ్చుకోవడం బాధాకరమన్నారు.
పోలవరం ప్రాజెక్టు లోయర్ కాఫర్ డ్యామ్ నుంచి ఇసుక రవాణాకు పాల్పడి నాశనం చేశారని ఆరోపించారు. ఇది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని దేవినేని ఉమా అన్నారు. టీడీపీపై బురదజల్లడం, అవినీతి ఆరోపణలు చేయడం, నాయకులను జైళ్లల్లో పెట్టడం తప్ప.. ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన వైసీపీకి లేదని దేవినేని ఉమమహేశ్వరరావు మండిపడ్డారు.