తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడులకు నిరసనగా నేడు(బుధవారం) ఏపీ బంద్‌కు టీడీపీ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా టీడీపీ నేతలను పోలీసులు గృహనిర్భంధం చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు.విశాఖ జిల్లాలోనూ పలువురు టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.
టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌తోపాటు 10 మంది నాయకులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును, పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరులో బడేటి చంటి, భీమడోలులో గన్ని వీరాంజనేయులు, పెడనలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాగిత కృష్ణప్రసాద్‌ను గృహనిర్భంధంలో ఉంచారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అరవిందబాబును అరెస్ట్ చేసి శావల్యాపురం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఆందోళనతో పలుచోట్ల జాతీయ రహదారులపై వాహనాలు నిలిచిపోయాయి.