'అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం కామెడీగా ఉంది'
TDP leader Yanamala's satirical comments on CM Jagan. అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి
By అంజి Published on 15 Dec 2022 4:28 PM ISTఅవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఇక నుంచి అవినీతికి వీల్లేదని సీఎం జగన్ చెబుతున్నారని.. అంటే గత 42 నెలలుగా అవినీతికి గేట్లు తెరిచినట్లేనా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుల లిస్టులో ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్న జగన్ అవినీతి చేయడానికి వీల్లేదని తన మంత్రులకు చెప్పడం ఈ 100 సంవత్సరాల్లో అతిపెద్ద జోక్ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు.
సీఎం జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే కామెడీలో ఛార్లీ చాప్లిన్‌తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నట్టుందని అన్నారు. 43 వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీ కేసులో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు ఎదుర్కొంటూ, 16 నెలల జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి వైఎస్ జగన్ అని యనమల వివరించారు. లక్ష గొడ్లను తిన్న రాబంధు.. ఇక మాంసాహారం ముట్టుకోనంటూ ప్రమాణం చేసినట్లు జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. మూడున్నరేళ్లుగా ల్యాండ్, శాండ్, వైన్, మైన్ దోపిడీతో రాష్ట్రాన్ని సాంతం దోచుకున్నారని ఆరోపించారు.
మద్య నిషేధం పేరుతో రాష్ట్రంలోని మద్యం వ్యాపారం మొత్తాన్ని శాసిస్తూ ఇప్పటికే సుమారు రూ.30 వేల కోట్లు కొల్లగొట్టారని యనమల ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో చేసిన దోపిడీ, ఆ స్థలాల చదును పేరుతో చేసిన దోపిడీ సొమ్ముతో తాడేపల్లి ఖజానా నిండిందన్నారు. విశాఖ రాజధాని పేరుతో జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి రూ.40 వేల కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకున్నారని అన్నారు. సీఎం జగన్ ఇప్పటికైనా కామెడీలు చేయడం మాని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని అని యనమల హితవు పలికారు.