బీజేపీ అంటే భారతీయ జగన్ పార్టీ : పయ్యావుల కేశవ్
TDP Leader Payyavula Kesav Fires on AP BJP.భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలపై తెలుగుదేశం పార్టీ నేత
By తోట వంశీ కుమార్ Published on 28 Dec 2021 12:20 PM ISTభారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలపై తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆరాచకాలు కొనసాగిస్తున్నా.. రాష్ట్ర బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. బీజేపి అజెండా అయిన హిందూత్వ అంశాలపై కూడా మాట్లాడడం లేదన్నారు. ఆలయాలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ నిర్వహించే ప్రజాగ్రహ సభ చరిత్రలో బూటకంగా నిలిచిపోతుందన్నారు.
దేశంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ఉన్న బీజేపీకి చాలా తేడా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ జగన్ కు అనుకూలంగా పనిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ అంటే 'భారతీయ జగన్ పార్టీ' అనేలా తయారయిందని దుయ్యబట్టారు. సీఎం జగన్ నెట్ వర్క్ లో రాష్ట్ర బీజేపీ పని చేస్తోందన్నారు. ఇక విజయడవాడలో బీజేపీ నిర్వహిస్తున్నది ప్రజాగ్రహ సభ కాదు జగన్ అను గ్రహ సభ అంటే బాగుందని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలకు తెలియదా? అని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి చెపితేనే వీళ్లలో చలనం వచ్చిందన్నారు.
పశ్చిమబెంగాల్ లో చీమ చిటుక్కుమన్నా కేంద్ర హోంమంత్రి వెళతారని.. అయితే ఏపీలో ఏమి జరిగినా కేంద్రం మాట్లాడటం లేదన్నారు. రాష్ట్ర రాజకీయాలను కేంద్రం టెలిస్కోప్ లో చూస్తుందని కేంద్ర మంత్రి ఒకరు చెప్పారని.. అయితే ఇక్కడ సినిమా స్కోపీలో అన్యాయం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టారు. ఏపీలోని జగన్ అనే వైరస్ కు కేంద్రం వ్యాక్సిన్ వేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇప్పటికైనా రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ అరాచకాలపై పోరాడాలని హితవు పలికారు. రాష్ట్రంలో పోలీసులే సామాన్యుల రూపంలో వచ్చి దాడులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసినా రాష్ట్ర బీజేపీ స్పందించలేదని మండిపడ్డారు. కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తున్నా.. దాని గురించి మాట్లాడం లేదని విమర్శించారు.