ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకే ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలుగు దేశం పార్టీ(టీడీపీ) నాయకులు పయ్యావుల కేశవ్ అన్నారు. ఊహల్లో బతుకుతున్న జగన్ కు వాస్తవాలు అర్థమయ్యేసరికి భాష మారిందని ఎద్దేవా చేశారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా పీకుడు భాష మాట్లాడతారా? అని ప్రశ్నించారు.
గడిచిన మూడు సంవత్సరాలలో మహిళలు, రైతులు, యువత జీవితాల వెలుగులను జగన్ పీకేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించేందుకు దుర్భాష లాడుతున్నారని విమర్శించారు. ఈ మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పనైనా సక్రమంగా చేసిందా? ప్రజావేదిక దగ్గర నుంచి పోలవరం వరకు ఏం చేశారో చెప్పాలని, రాష్ట్ర నిధులతో ఒక్కరోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. జగన్ భాష మార్చుకోవాలని లేకపోతే తాము కూడా అదేబాటలో పయనించవలసి వస్తుందన్నారు. బాష మార్చుకోకపోతే ప్రజలే మిమ్మల్ని పీకే పరిస్థితి వస్తుందన్నారు. పీకేను పీకే ధైర్యం మీకు ఉందా..? రాయలసీమలో ఎంత మంది మంత్రులను పీకుతారో చూద్దాం అంటూ కేశవ్ అన్నారు.