టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువ గళం పాదయాత్ర ఆదివారం నాటికి 99వ రోజుకు చేరుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని వెలగాంలో ఈరోజు కొత్త రామాపురం గ్రామస్తులతో లోకేష్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం అటవీశాఖ కార్యాలయం సమీపంలో నైపుణ్యం కలిగిన కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం అనంతరం తెలుగుగంగ ప్రాజెక్టును సందర్శిస్తారు. ఆదివారం సాయంత్రం వెలుగోడులో ఎస్సీ, బుడగజంగాలు, స్థానికులతో సమావేశమవుతారు. నారా లోకేష్ రాత్రికి బోయ రేవుల శివారు రిసార్ట్‌లో బస చేయనున్నారు.
కాగా, 100 రోజుల యువ గళం పాదయాత్రకు సంఘీభావంగా సోమవారం నంద్యాల జిల్లా వ్యాప్తంగా లోకేష్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందులో భాగంగా చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గిరింపేట దుర్గమ్మ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.