ఏపీకి తానే చివరి సీఎం అని జగన్ అనుకుంటున్నారేమో : చంద్రబాబు
TDP Leader Chandrababu comments on Financial Situation of AP.వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2022 2:36 PM ISTవైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విమర్శలు చేశారు. జగన్‌కు సొంత లాభం తప్ప ప్రజాక్షేమం పట్టదన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో జీవన ప్రమాణాలు దిగజారిపోయాయన్నారు. రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు, వేధింపులకు గురి చేస్తున్నారన్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని.. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి తీసుకువచ్చారన్నారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందన్నారు.
రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని, చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇంకొన్ని రోజులు ఆగితే.. రోడ్లను కూడా తాకట్టు పెడతారని విమర్శించారు. తానే చివరి ముఖ్యమంత్రినని ఇక రాష్ట్రం ఉండదని జగన్ అనుకుంటున్నట్లున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తులు మారుతారు కానీ లెక్కలు శాశ్వతమని చెప్పారు. ప్రభుత్వానికి కొన్ని లెక్కలుంటాయని ఏం జరిగిందో చరిత్ర మొత్తం డాక్యుమెంటేషన్‌తో ఉంటుందన్నారు.
రాష్ట్ర జనాభా 5కోట్లు అని.. ప్రతి కుటుంబంపై ఇప్పుడు రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు అప్పు ఉందన్నారు. ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూళ్లు చేస్తున్నారన్నారు. పెట్రోల్, గ్యాస్, మద్యం, విద్యుత్ ధరలు రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయన్నారు. చివరికి చెత్త, మరుగుదొడ్లు, వారసత్వ ఆస్తుపైనా పన్నులు వేస్తున్నారన్నారు. ఆ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెలుతున్నాయో చెప్పాలన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. వైసీపీ నేతలు కోటీశ్వరులవుతుంటే పేదలు నిరుపేదలుగా మారుతున్నారన్నారు. పోలవరంలో అవినీతి జరిగిందని గతంలో జగన్ ఆరోపణలు చేశారని ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ఆ ఆరోపణలను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు లేదన్నారు.