'దమ్ముంటే చర్చకు రావాలి'.. వైఎస్‌ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్‌

రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రజలను సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు.

By అంజి  Published on  8 Oct 2024 11:47 AM IST
TDP , Buddha Venkanna,YS Jagan,open discussion, APnews

'దమ్ముంటే చర్చకు రావాలి'.. వైఎస్‌ జగన్‌కు బుద్ధా వెంకన్న సవాల్‌

అమరావతి: రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రజలను సీఎం చంద్రబాబు ఆదుకున్న తీరు దేశానికి ఆదర్శమని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. వరద సాయంలో అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపించడం సిగ్గుచేటని తెలిపారు. దమ్ముంటే వరద సాయంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీ అధినేత జగన్‌కు సవాల్‌ విసిరారు. వరద బాధితుల కోసం జగన్‌ ఏం చేశారో చెప్పాలన్నారు.

మంగళవారం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. వరదల సమయంలో తమ ప్రభుత్వం ఇంటింటికీ ఆహారం, మంచినీరు, అందించిందన్నారు. ప్రజలు అందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయట పడ్డామని చెప్పారని.. ఇటువంటి వాటిని చూసి వైసీపీ నేతలు భరించలేకపోతున్నారని అన్నారు. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనడానికి సిగ్గు ఉండాలంటూ ఫైర్‌ అయ్యారు. అబద్దాలు చెప్పే.. ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇప్పుడు కూడా అలాగే చెప్తే ‌‌వైసీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు.

దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందని అంటున్న వైఎస్‌ జగన్‌ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందన్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న జగన్ నీతులు వల్లిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అబద్దాలు చెప్పడానికి కూడా అర్ధం లేదా వైసీపీకి అంటూ మండిపడ్డారు. ‘‘జగన్ ప్రజలకు సేవ చేయడం అలవాటు చేసుకో.. కుట్ర, కుళ్లు రాజకీయాలు మానుకో జగన్’’ అంటూ టీడీపీ నేత బుద్దా వెంకన్న హితవుపలికారు.

Next Story