కూటమి గెలవకపోతే నా నాలుక కోసుకుంటా: బుద్ధా వెంకన్న

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆరా మస్తాన్‌ ఫేక్‌ సర్వే చేశారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు.

By అంజి  Published on  2 Jun 2024 2:05 PM IST
TDP, Buddha Venkanna, Aaraa Mastan, Andhrapradesh

కూటమి గెలవకపోతే నా నాలుక కోసుకుంటా: బుద్ధా వెంకన్న

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆరా మస్తాన్‌ ఫేక్‌ సర్వే చేశారని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. టీడీపీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి సీఎం జగన్‌ ఈ సర్వే విడుదల చేయించారని ఆరోపించారు. ఈసారి కూటమి గెలవకపోతే తాను నాలుక కోసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరా సర్వేకు వ్యతిరేకంగా కూటమి అధికారంలోకి వస్తే మస్తాన్‌ నాలుక కోసుకుంటారా?. అని సవాల్‌ విసిరారు. తన సవాల్‌ను స్వీకరించాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. క్రిమినల్ ఆలోచనలతో జగన్ ఫేక్ సర్వే చేయించాడని విరుచుకుపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పే దమ్ము ధైర్యం జగన్‌కు ఉందా అని బుద్దా వెంకన్న నిలదీశారు. ఓటమి తప్పదనే నిరాశలో వైసీపీ క్యాడర్‌ ఉంది అని అన్నారు. వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఆరా సర్వే చెప్పించారని అన్నారు. ఇది ఫేక్ సర్వే అన్న విషయం వైసీపీ ముఖ్య నేతలకు తెలుసునన్నారు. ''ఎగ్జిట్ పోల్స్ కోసం గతంలో ప్రజలు ఎదురు చూసే వారు కాదు. నిన్న మాత్రం చూశారు. కౌంటింగ్ కోసం వెళ్లే విపక్ష పార్టీల‌ ఏజెంట్లను భయపెట్టాలని చూస్తున్నారు. చంద్రబాబు మళ్లీ సీఎంగా అడుగుపెడతానని గతంలో ప్రకటించారు. అది నిజం అవుతుంది. కూటమి అధికారంలోకి రాగానే ఆరా మస్తాన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి'' అని బుద్ధా వెంకన్న అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోతోందని ఆరా మస్తాన్‌ సర్వే అంచనా వేసింది. 2 శాతం ఓట్ల ఆధిక్యంతో టీడీపీ కంటే వైసీపీ 20 నుంచి 25 సీట్లు ఎక్కువగా సాధించబోతోందని మస్తాన్‌ ప్రకటించారు. కానీ ఈ సర్వే పట్ల రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేలూ కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా మస్తాన్‌ ఒక్కరే వైసీపీకి అనుకూలంగా ప్రకటించారు. దీంతో మస్తాన్‌ మరో లగడపాటి కాబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Next Story