అర్ధరాత్రి బెయిల్‌పై బుద్దా వెంకన్న విడుదల
TDP leader Budda Venkanna Released on Station Bail.ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లపై
By తోట వంశీ కుమార్ Published on 25 Jan 2022 5:21 AM GMTఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లపై సోమవారం ఉదయం మీడియా సమావేశంలో తీవ్ర విమర్శలు చేశారనే ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను నిన్న సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అమరావతి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అర్థరాత్రి వరకు ఆయన్ను విచారించిన పోలీసులు.. రాత్రి 11.15 గంటల సమయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు. రెచ్చగొట్టేలా ప్రసంగం చేసినందుకు సెక్షన్ 153ఎ, భయోత్సాతం సృష్టించినందుకు సెక్షన్ 506, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని 505 (2), రెడ్ విత్ 34 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
బెయిల్‌పై విడుదలైన బయటకు వచ్చిన అనంతరం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడారు. తాను మాట్లాడిన మాటలు వాస్తవమేనన్నారు. డీజీపీ సవాంగ్.. సీఎం జగన్‌కు తొత్తుగా పని చేస్తున్నారని ఆరోపించారు. తన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమైతే మంత్రి కొడాలి నాని చేసినవి చట్టబద్ధమా..? అని ప్రశ్నించారు. మంత్రి కొడాలి నాని మూడేళ్లుగా అసభ్య వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
రూ.250 కోట్లు చేతులు మారాయి
అంకముందు సోమవారం ఉదయం బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని కన్వెక్షన్ సెంటర్‌లో నిర్వహించిన క్యాసినో వ్యవహారంలో రూ.250 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో డీజీపీ వాటా ఎంతని ప్రశ్నించారు. డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. క్యాసినో నిర్వహించినట్లు సాక్ష్యాలున్నప్పటికీ మంత్రి కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నాని చరిత్ర గుడివాడలో అందరికీ తెలుసునని అన్నారు. షర్మిల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పెడితే.. తొలుత మారేది కొడాలి నానే అని జోస్యం చెప్పారు. ఆ తరువాత జగన్‌ను దూషిస్తారన్నారు. సీనియర్ నాయకులు రామయ్య, మాజీ ప్రజాప్రతినిధులు బోండా ఉమా, జవహర్ వంటి వారిని దూషించడం ఆయనకు ఎస్సీ, ఎస్టీ, బీసీలపైన గౌరవాన్ని స్పష్టం చేస్తోందని విమర్శించారు.