పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు.

By అంజి  Published on  26 May 2024 9:04 AM GMT
TDP, Pinnelli Ramakrishna Reddy, Perni Nani, Andhrapradesh

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యకు టీడీపీ ప్రయత్నం: పేర్ని నాని

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హత్య చేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఆరోపించారు. ఆ పార్టీ కుట్రలకు కొందరు పోలీసులు, అధికారుల సహకారం ఉందని, అందుకే ఎమ్మెల్యే ఇంటి దగ్గర బలగాలను తొలగించారని చెప్పారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ కూడా కూటమి నేతలు చెప్పినట్టు వ్యవహరిస్తోందన్నారు. హింస జరిగిన తర్వాత కూడా పోలీసులు స్పందించలేదు, అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారంటూ పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పిన్నెల్లికి హాని జరిగితే ఐజీ, ఎస్పీ, డీజీపీదే బాధ్యత అంటూ పేర్కొన్నారు. టీడీపీ నేతలతో కలిసి ఎస్సై నారాయణస్వామి కుట్రలు చేశారని.. అన్ని ఆధారాలతో చెబుతున్నామన్నారు. డీజీపీతో విచారణ జరిపించాలంటూ పేర్ని నాని కోరారు. ఒక కంటికి కాటుక పెట్టి, మరో కంట్లో కారం కొట్టినట్లు పోలీసులు ప్రవర్తిస్తున్నారని చెప్పారు. పోలింగ్ రోజు హింస జరుగుతుందని ముందే తెలిసినా స్పందించని పోలీసులు.. తీరా హింస జరిగాక వైసీపీ నాయకులపై కేసులు పెట్టారని ఆరోపించారు.

ఇదిలా ఉంటే.. పిన్నెల్లి, ఆయన సోదరుడు రామిరెడ్డిపై మరో హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. కారంపూడి సీఐ నారాయణ స్వామిపై రాళ్ల దాడి ఘటనపై ఈ కేసు నమోదు చేశారు. తొలుత గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కేసు ఫైల్‌ చేయగా.. స్పృహలోకి వచ్చిన అనంతరం సీఐ ఇచ్చిన స్టేట్మెంట్‌తో తాజా కేసు నమోదు అయ్యింది. ఇప్పటికే టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై ఓ హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది.

Next Story