నందిగామలో తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి ఘటనపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. రాళ్లదాడి ఘటనపై బెయిలబుల్ కేసు నమోదు చేయాలని టీడీపీ నేతలు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుల ఫొటోలను కూడా టీడీపీ నాయకత్వం విడుదల చేసింది. గవర్నర్‌తో భేటీ అనంతరం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల నిర్లక్ష్యం వహించడం వల్లే చంద్రబాబుపై దాడి జరిగిందని అన్నారు. 324 చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు హాస్యాస్పదంగా వ్యవహరించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
విశాఖపట్నంలో మంత్రి కారును ఢీకొడితే హత్యాయత్నం కేసు నమోదైందని, అయితే ఇక్కడ దాడి జరిగి రక్తం కారినా బెయిలబుల్ సెక్షన్ పెట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గవర్నర్ కూడా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లను పోలీసులు ప్రోత్సహించారని బోండా ఉమ అన్నారు. కాబోయే ముఖ్యమంత్రిపై దాడి జరిగితే రూ.100 జరిమానాతో బెయిల్ పై విడుదల చేసేలా చిన్నపాటి కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. రాజకీయ పార్టీని అడ్డుకున్న పోలీసు వ్యవస్థ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. నామమాత్రపు కేసు నమోదు చేయడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అన్నారు.