వారిని ఆదుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు చంద్రబాబు లేఖ
TDP Chief Nara Chandrababu Naidu writes letter to AP CS.తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
By తోట వంశీ కుమార్ Published on 28 Nov 2021 11:27 AM ISTతెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్ శర్మకు లేఖ రాశారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వరదల కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి, పంట నష్టం సంభవించాయన్నారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ కమ్యూనికేషన్ వ్టవస్థలు దారుణంగా దెబ్బ తిన్నాయని.. తుఫాను, వరదలు తగ్గి రోజులు దాటిపోతున్నా.. ఇప్పటికీ కూడా బాధితులకు తిండి, వసతి లేక రోడ్ల మీదే ఉండిపోయారని.. వారిని వెంటనే ఆదుకోవాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షలు, మిగిలిన బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టివ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇక వరదల్లో ప్రభుత్వ వైఫల్యంపై న్యాయ విచారణకు చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం రూ. 6054 కోట్ల నష్టం జరిగితే.. ప్రభుత్వం కేవలం రూ.35 కోట్లను మాత్రమే విడుదల చేయడం సరికాదన్నారు. ప్రకృతి వైపరీత్యాల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని కాగ్ తప్పుబట్టిందని.. జాతీయ ప్రకృతి విపత్తుల నిర్వహణ నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొట్టుకుపోయిందని ఆరోపించారు. తిరుపతి సమీపంలోని తుమ్మలగుంట చెరువును ఆట స్థలంగా మార్చడంతో తిరుపతి నగరాన్ని వరదలు ముంచెత్తాయన్నారు.