ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. సాక్షుల‌ను బెదిరిస్తున్నారు

TDP chief Chandrababu letter to AP DGP.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2022 7:11 AM GMT
ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ.. సాక్షుల‌ను బెదిరిస్తున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డీజీపీకి లేఖ రాశారు. చిత్తూరు మాజీ మేయ‌ర్ క‌టారి అనురాధ దంపతుల హ‌త్య కేసు విచార‌ణ‌లో కావాల‌నే జాప్యం చేస్తున్నార‌ని ఆరోపించారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబసభ్యులు కోరుతున్నార‌న్నారు. బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరించి కేసును నీరు గార్చేందుకు స్థానిక పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు.

ఈ కేసులో కీలక సాక్షి అయిన సతీశ్‌ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారని తెలిపారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అక్ర‌మ కేసు పెట్టి అరెస్టు చేశార‌న్నారు. అడ్డుకున్న మాజీ మేయ‌ర్ హేమ‌ల‌త‌తో దారుణంగా వ్య‌వ‌హరించారు. పోలీసు చర్యలను నిరసించిన ఆమెపై పోలీసు జీపు ఎక్కించారని, తీవ్ర‌గాయాల‌తో హేమ‌ల‌త ఆస్ప‌త్రి పాలయ్యార‌న్నారు.

పైగా పోలీసు జీపు డ్రైవర్‌పై దాడి జరిగిందని ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. పూర్ణపై అక్రమ కేసు బనాయించిన పోలీసుల‌పై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసుల‌పై ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగేలా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు ఆ లేఖ‌లో కోరారు.

Next Story
Share it