చంద్రబాబుకి ఏపీ హైకోర్టులో ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది.
By Srikanth Gundamalla Published on 11 Oct 2023 10:09 AM GMTచంద్రబాబుకి ఏపీ హైకోర్టులో ఊరట
టీడీపీ అధినేత చంద్రబాబుకి ఏపీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంగళ్లు కేసులో ఈ నెల 12వ తేదీ వరకు చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ అక్టోబర్ 16వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది. ఈ మేరకు రెండు కేసుల్లో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని.. ఏపీ హైకోర్టును చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. కేసుల్లో విచారణకు సహకరిస్తామని న్యాయస్థానానికి ఆయన తెలిపారు. ఇదే విషయంపై సీఐడీ, హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని హైకోర్టుకు ఏజీ శ్రీరామ్ తెలిపారు. ఈ దశలో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇక ఇరు వైపులా వాదనలు విన్నత తర్వాత.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబుని అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.