ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనది: చంద్రబాబు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
By Srikanth Gundamalla Published on 10 May 2024 9:43 AM GMTల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనది: చంద్రబాబు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైనదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు సీఎం జగన్ పాలనలో సంతోషంగా లేరని చంద్రబాబు చెప్పారు.
సీఎం జగన్ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తులను కొట్టేయడానికి ప్లాన్ చేశారని చెప్పారు చంద్రబాబు. ఇందులో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చారని అన్నారు. ఈ చట్టం చాలా దుర్మార్గమైనది చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదే అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామకృష్ణమరాజును హింసించారంటూ చంద్రబాబు మండిపడ్డారు. అందుకే వైసీపీ ప్రభుత్వానికి ఓటర్లు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు చంద్రబాబు.
ఏపీ రాష్ట్రాన్ని పాలించేది అహంకారి, దోపిడీదారు.. సైకో అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగానే ఇసుకను ఇచ్చానని గుర్తు చేశారు. ప్రజల భూములను కొట్టేయడానికి జగన్ ముఠా వస్తోందనీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ ఒక్కసారి అంటూ జగన్‌కు ఓటేస్తే మీ ఆస్తులను పోగొట్టుకున్నవారు అవుతారని చెప్పారు. వారసత్వంగా వచ్చిన భూమిపై సీఎం జగన్ తన ఫొటో ఎందుకు వేసుకున్నారని చంద్రబాబు నిలదీశారు. భూమి ప్రజలది కానీ.. పెత్తనం మాత్రం జగన్ ఎందుకు చెలాయించాలన్నారు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీకి ఉరివేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.