ప్రజలిచ్చిన తీర్పుతో ఆకాశంలో ఎగరొద్దు: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 10:13 AM GMTప్రజలిచ్చిన తీర్పుతో ఆకాశంలో ఎగరొద్దు: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని తిరుగులేని పార్టీగా నిలబడింది. అధికార పార్టీని చిత్తుగా ఓడించి.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదు. ఇక తాజాగా చంద్రబాబు సాధించిన మెజార్టీ సీట్లు కేంద్రంలో ప్రధానిని డిసైడ్ చేసే వరకూ వెళ్లింది. రాష్ట్రానికి కావాల్సిన వాటి గురించి.. పదవులు సహా ఇతర అంశాలపై ఎన్డీఏ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు మోదీ. ఇక ఈ క్రమంలోనే విజయవాడలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా తాజాగా గెలిచిన ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పదవులు శాశ్వతం కాదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీకి పట్టం కట్టారనీ.. యూనానిమస్‌గా విజయాన్ని అందుకున్నామన్నారు. రికార్డు స్థాయిలో సీట్లను సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇక ఎన్నికల్లో విజయాన్ని అందుకున్న ఎంపీలందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. ఈ క్రమంలోనే ఎంపీలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరొద్దని చెప్పారు. ఈ విజయాన్ని సమాజ సేవకు మాత్రమే వినియోగించాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఎంపీలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఇదే ప్రథమ కర్తవ్యంగా ముందుకు సాగుదామన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను గౌరవించాలని ఎంపీలతో చెప్పారు. ఆ తర్వాతే మనమంటూ గుర్తుంచుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. పదవులు శాశ్వతం అని ఎవరూ అనుకోవద్దని చెప్పారు. మరోవైపు ఈ నెల 12వ తేదీన ప్రమాణస్వీకారోత్సవానికి మోదీని ఆహ్వానించినట్లు చెప్పారు. ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చేందుకు సానుకూలంగానే స్పందించారని ఎంపీలతో చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ ఎంపీలు జగన్ కేసుల మాఫీ కోసమే పని చేశారనీ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ పోరాడలేదంటూ చంద్రబాబు విమర్శలు చేశారు.