కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  5 March 2024 11:52 AM IST
tdp, chandrababu, letter,  andhra pradesh, dgp,

కేసుల వివరాలు ఇవ్వండి.. డీజీపీకి చంద్రబాబు లేఖ

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈనేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. రాబోయే ఎన్నికల్లో నామినేషన్‌లో పొందుపర్చేందుకు తనపై నమోదు అయిన కేసుల వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. 2019 తర్వాత వివిధ జిల్లాల్లో తనపై పోలీసులు పెట్టిన వివరాలు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. తనపై నమోదైన కేసులతో పాటు టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థిపై ఉన్న కేసుల వివరాలు తెలపాలని ఆయన కోరారు.

ఏపీ డీజీపీతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలకు, ఏసీబీ, సీఐడీ విభాగాలకు కూడా చంద్రబాబు లేఖలు పంపారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు. గత ఐదేళ్లలో ప్రజా సమస్యలపై తాము పోరాడుతున్నామని చెప్పారు. దాంతో.. ప్రభుత్వం అక్కసుతో అక్రమ కేసులు బనాయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నందున పోలీస్‌స్టేషన్లతో పాటు వివిధ ఏజెన్సీల ద్వారా కేసులు పెట్టారని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత ఏజెన్సీలు, అధికారులు పెట్టిన పలు కేసుల విషయంలో తన వద్ద సమాచారం లేదని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అందుకే 2019 నుంచి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నమోదు చేసిన కేసలు వివరాలు తెలపాలని చంద్రబాబు కోరారు.

తనపై ఉన్న కేసులతో పాటు తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై ఎక్కడ ఏ కేసు ఉందో ముందే తెలపాలని కోరారు. ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నందున ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. వ్యక్తిగతంగా తాను ప్రతి పోలీస్‌ స్టేషన్‌ నుంచి సమాచారం పొందడం అనేది ఆచరణ సాధ్యం కాదనీ.. కాబట్టి డీజీపీ కార్యాలయం ద్వారా కేసుల విషయంలో సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. చంద్రబాబు రాసిన లేఖపై డీజీపీ ఎలా స్పందిస్తారు? కేసుల వివరాలు అందిస్తారా లేదా అన్నది చూడాలి.


Next Story