తారకరత్నకు మరిన్ని ఆరోగ్య పరీక్షలు.. ఆ తర్వాతే హెల్త్ బులెటిన్ విడుదల

Tarakaratna to undergo crucial tests, doctors to release health bulletin later. నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స

By అంజి  Published on  30 Jan 2023 6:59 AM GMT
తారకరత్నకు మరిన్ని ఆరోగ్య పరీక్షలు.. ఆ తర్వాతే హెల్త్ బులెటిన్ విడుదల

నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉంది. ప్రత్యేక వైద్యుల బృందం నేడు కీలక పరీక్షలు నిర్వహించి హెల్త్ బులెటిన్ విడుదల చేయనుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. వైద్యుల శ్రమ ఫలిస్తోంది. గుండె పనితీరులో మెరుగుదల ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు వైద్య నిపుణులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ చేసిన తర్వాతే తారకరత్న ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

మరోవైపు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వద్ద అభిమానులు, సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో ఆస్పత్రి వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని స్థానిక పోలీసులను బెంగళూరు సిటీ పోలీస్‌ కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి ఆదేశించారు. తారకరత్నను చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కుటుంబ సమేతంగా నిన్న ఆసుపత్రికి వచ్చారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెప్పారని, తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు.

శుక్రవారం ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్నారు. మసీదులో ప్రార్థనలు చేసి బయటకు వచ్చి మళ్లీ పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో తారకరత్న ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు వెంటనే సమీపంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పీఈసీ ఆస్పత్రికి తరలించారు. వెంటనే నందమూరి బాలయ్య అక్కడికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. శనివారం రాత్రి కుప్పం ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు తారకరత్నను ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు హృదయాలయానికి తరలించారు. అక్కడి వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

Next Story