మన్యంలో మళ్లీ ఆంత్రాక్స్ భయం మొదలైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టుల మండలంలోని మారుమూల గ్రామం దొరగుడలో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. లక్ష్మీపురం పంచాయతీ దొరగుడ గ్రామంలో ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడం.. స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు తెలియడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఓ చిన్నారికి ఏర్పడిన గాయాలను చూసిన ఆశా కార్యకర్త.. వెంటనే బాలిక గాయాల ఫొటోలు తీసి వైద్యులకు పంపారు.
దీనిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. గురువారం దొరగుడలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయించారు. వైద్యుల బృందం గ్రామంలో పర్యటించి.. పరీక్షలు చేశారు. 15 మందికి ఆంత్రాక్స్ లక్షణాలు కనిపించాయి. వారిలో ఏడుగురికి తీవ్ర లక్షణాలు ఉండటంతో వారి బ్లడ్ శాంపిళ్లను సేకరించారు. విశాఖ కేజీహెచ్‌లోని ల్యాబ్‌కు బ్లడ్ శాంపిళ్లను పంపుతామని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం ఆంత్రాక్స్ వ్యాధా.. కాదా అనే దానిపై నిర్ధారణకు వస్తామని వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. గ్రామంలోని పశువులకు టీకాలు వేశారు.
గతంలోనూ లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని నాలుగైదు గ్రామాల్లో.. ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో పదుల సంఖ్యలో చిన్నారులు మృత్యువాతపడ్డారు. పశువుల నుంచి ఆంత్రాక్స్ వ్యాధి వ్యాపిస్తుంది.